Download Our App

అత్యంత ఖరీదైన ఆవు ఇదే..!ఈ నెల్లూరు జాతి ఆవు ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

Picture of RaamSee

RaamSee

Staff Reporter, Warangal

ఆవులు, గుర్రాలు తదితర జంతువులకు సంబంధించి తరచుగా వేలం పాటలు జరుగుతుంటాయి. వీటిలో కొన్ని జంతువులు కోట్ల రూపాయలకు అమ్ముడు అవుతూ రికార్డు సృష్టిస్తుంటాయి.

అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జాతికి చెందిన ఒక ఆవు కనీవినీ ఎరుగని రీతిలో కళ్లు చెదిరే ధర పలికింది. బ్రెజిల్‌ (Brazil)లో జరిగిన ఒక వేలంలో ఏకంగా 40 కోట్ల రూపాయలకు అమ్ముడైంది. ఈ ఆవు పేరు వయాటినా-19 ఎఫ్‌ఐవీ మారా ఇమోవీస్. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆవుగా రికార్డు సృష్టించి భారతదేశానికి గర్వకారణంగా నిలుస్తోంది.

ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన వయాటినా-19 ఎఫ్‌ఐవి మారా ఇమోవీస్ ఆవు నెల్లూరు జాతికి గర్వకారణంగా నిలుస్తోంది. ఈ ఆవు అద్భుతమైన జన్యువులను కలిగి ఉంది. ఇది చాలా ఎక్కువ పాలు ఇస్తుంది, వ్యాధులకు తక్కువగా గురవుతుంది. వేడి వాతావరణంలో కూడా బాగా జీవించగలదు. చాలా బలిష్టంగా ఉండే ఈ ఆవుకు తెల్లటి బొచ్చు ఉంటుంది. దీని భుజాలపై ఒక గుబ్బల మూపురం ఉంది. ఈ రికార్డు ధర కారణంగా నెల్లూరు జాతి ఆవులకు ప్రపంచవ్యాప్తంగా మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ఈ వేలం బ్రెజిల్‌లోని సావోపాలోలోని అరండులో జరిగింది.

 

* బ్రెజిల్‌లో నెల్లూరు జాతి ఆవులు

నెల్లూరు జాతి ఆవులను శాస్త్రీయంగా బోస్ ఇండికస్ (Bos indicus) అని పిలుస్తారు. ఇవి ఒంగోలు పశువుల నుంచి ఉద్భవించాయి. అంటే ఒంగోలు జాతితో వీటికి జన్యుపరంగా లేదా వంశపరంగా సంబంధం ఉండవచ్చు. 1868లో ఒంగోలు జాతికి పొందిన రెండు పశువులను ఓడలో బ్రెజిల్‌కు తీసుకెళ్లారు. ఒంగోలు నుంచి బ్రెజిల్‌కు వెళ్లిన తొలి పశువులు అవే. అక్కడ సాల్వడార్, బహియాలో దిగాయి. ఆ తరువాత 1878లో హాంబర్గ్ జంతుప్రదర్శనశాల నుంచి మరో రెండు పశువులు దిగుమతి అయ్యాయి, దీనివల్ల జాతి జన్యు సమూహం మరింత బలపడింది. 1960లో నెల్లూరు పశువులు బ్రెజిల్‌లో వందల సంఖ్యలో పెరిగాయి. దీంతో అక్కడ వాటి విస్తృత ఉనికికి పునాది పడింది.

* నెల్లూరు జాతి పశువుల ప్రత్యేకత

నెల్లూరు జాతి ఆవులు అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోగలవు, అందువల్ల వేడి ప్రాంతాలలో కూడా ఆరోగ్యంగా పెరుగుతాయి. వీటికి మంచి డైజెస్టివ్ పవర్ ఉంటుంది. పోషకాలను చక్కగా గ్రహించగలవు. ఈ ఆవులు పరాన్నజీవుల ఇన్ఫెక్షన్లకు బలమైన ప్రతిరోధక శక్తిని కలిగి ఉంటాయి. అందువల్ల పశువుల పెంపకందారులకు చాలా అనుకూలంగా ఉంటాయి. వీటికి పుట్టే పిల్లలు కూడా చాలా దృఢంగా, అసాధారణమైన సామర్థ్యాలను పొందుతాయి. అందువల్ల ఈ నెల్లూరు జాతి ఆవులకు ఎప్పుడూ డిమాండ్ నెలకొంటుంది.

బ్రెజిల్‌లో నెల్లూరు జాతి ఆవులు సహజ సామర్థ్యాలతో పెరుగుతాయి. సాధారణమైన ఆహారం తిని బలమైన దూడలకు జన్మనిస్తాయి. అందుకే ఇవి రైతులకు బెస్ట్ ఛాయిస్‌గా మారాయి, అలానే ఆ దేశంలోని మొత్తం ఆవుల సంఖ్యలో ఏకంగా 80% వరకు ఇవే ఉన్నాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు